Balakrishna: నా సోదరుడు మహేశ్ బాబుకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి: బాలకృష్ణ

Balakrishna pays tributes to Krishna
  • కృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బాలకృష్ణ
  • కృష్ణగారితో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వ్యాఖ్య
  • చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు మరువలేనివని కితాబు
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణగారితో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఆయన అన్నారు. నాన్నగారు, కృష్ణగారు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారని చెప్పారు. ఆయనతో కలిసి తాను నటించడం మర్చిపోలేనని అనుభూతి అని చెప్పారు. తన నటనతో కృష్ణగారు చిత్రసీమలో సరికొత్త ఒరవళ్లను సృష్టించి, ఎనలేని ఖ్యాతిని సంపాదించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేశారని కొనియాడారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. 

కృష్ణగారు లేని లోటు సినీ పరిశ్రమకు, అభిమానులకు ఎప్పటికీ తీరదని బాలకృష్ణ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇటీవలే మాతృమూర్తి ఇందిరాదేవి, సోదరుడు రమేశ్ బాబును కోల్పోయిన తన సోదరుడు మహేశ్ బాబుకు ఈ కష్టకాలంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు.
Balakrishna
Krishna
Tollywood

More Telugu News