voter list: హైదరాబాద్ ఓటర్ల జాబితాలో.. భారీగా పేర్ల తొలగింపు

  • జిల్లాలో జూబ్లిహిల్స్ లోనే తొలగింపులు ఎక్కువ
  • 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల పేర్లు తీసేసిన వైనం
  • ముసాయుదా జాబితా విడుదల చేసిన అధికారులు
  • అభ్యంతరాలు చెప్పేందుకు డిసెంబర్ 8 దాకా గడువు
CANCELLATION OF two and half LAKH VOTES IN HYDERABAD

హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. నకిలీ ఓట్ల కట్టడిలో భాగంగా ఒకటి కంటే ఎక్కువగా ఉన్న పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న వారికంటే తొలగించిన పేర్ల సంఖ్యే ఎక్కువని వివరించారు. 

ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలు చెప్పేందుకు డిసెంబర్ 8 వరకు గడువు విధించింది. కాగా, ఎన్నికల అధికారుల చర్య ఏకపక్షంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 2.79 లక్షల పేర్లను ఓటర్ జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దాదాపుగా 60 వేల మంది అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం తొలగించిన పేర్లు వీటికి ఆరు రెట్లు ఉండడం గమనార్హం. కాగా, పోలింగ్‌ కేంద్రాలు, సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల వద్ద ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ జాబితాపై అభ్యంతరాలను పరిశీలించి, మార్పులు చేర్పులు చేసి 2023 జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు వివరించారు.

గతేడాది జాబితా ప్రకారం నగరంలో 43.67 లక్షల ఓటర్లు ఉండగా.. తాజా తొలగింపులు, చేర్పుల తర్వాత ఆ సంఖ్య 41.46 లక్షలకు చేరింది. ఓటర్ జాబితాలో తొలగింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 29,591 పేర్లను తీసేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం జాబితాలో అత్యల్పంగా 1,716 మంది పేర్లను తొలగించారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన, చనిపోయిన ఓటర్లు, చిరునామా మారిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పొరపాటున ఓటరు లిస్ట్ లో మీ పేరు గల్లంతయితే.. వెంటనే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

More Telugu News