జీ20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్, వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- జీ20 దేశాల ప్రెసిడెన్సీ చేపట్టనున్న భారత్
- భారత్ లో 200 వరకు సమావేశాలు
- వచ్చే ఏడాది భారత్ లోనే శిఖరాగ్ర సమావేశం
- ఇది చారిత్రక ఘట్టం అని అభివర్ణించిన ప్రధాని మోదీ
'వసుధైక కుటుంబం' అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని అన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.
ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది.
జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.