Chandrababu: అయ్యన్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

Chandrababu Fires on YS Jagan over Ayyanna Patrudu Arrest
  • గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి అరెస్టులేంటని చంద్రబాబు ప్రశ్న
  • అయ్యన్న, రాజేశ్‌ల అరెస్ట్‌లు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్న టీడీపీ అధినేత
  • వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే బీసీ నేతపై కేసులని విమర్శ 
  • వెంటనే వారిద్దరినీ విడుదల చేయాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. 

చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
TDP
Ayyanna Patrudu
Narsipatnam

More Telugu News