Uttar Pradesh: ఇంట్లో చొరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగ.. ఆపై యజమానికి పార్శిల్‌లో పంపిన వైనం!

Thieves return Rs 4 lakh worth of stolen jewelry via courier
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • దీపావళి పండుగకు వెళ్లొచ్చేసరికి  టీచర్ ఫ్లాట్ గుల్ల
  • పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే వచ్చిన పార్శిల్
  • విప్పి చూసిన పోలీసులకు షాక్
ఓ ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన దొంగ ఆ తర్వాత ఆ బంగారాన్ని కొరియర్‌ ద్వారా ఇంటి యజమానికి పంపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకు దొంగతనం చేశాడో? మళ్లీ ఎందుకు ఆ సొత్తును వెనక్కి పంపాడో తెలియక ఇంటి యజమాని, పోలీసులు బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రాజానగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలో ఫార్చూన్ రెసిడెన్సీ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న ప్రీతి సిరోహి అనే ఉపాధ్యాయురాలు దీపావళి పండుగను జరుపుకునేందుకు అక్టోబరు 23న తన స్వగ్రామమైన బులంద్‌షహర్ వెళ్లారు. అక్టోబరు 27న సాయంత్రం తిరిగి వచ్చారు. 

అయితే, ఇంటి తాళం పగలగొట్టి ఉండడం, కబోర్డ్స్ తెరిచి ఉండడంతో చోరీ జరిగిందని భావించారు. బంగారం, రూ. 25 వేల నగదు మాయమైనట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొసైటీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ దొంగ ఉపాధ్యాయురాలి ఇంట్లోకి చొరబడినట్టు అందులో రికార్డయింది. కేసు దర్యాప్తులో ఉండగానే నాలుగు రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రీతికి పార్సిల్ వచ్చింది. అందులో ఏముందోనని భయపడిన ప్రీతి దానిని పోలీసులకు అప్పజెప్పారు. 

పోలీసులు ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో చోరీకి గురైన బంగారు ఆభరణాల్లో కొన్ని ఉన్నాయి. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. డీటీడీసీ కొరియర్‌లో వచ్చిన ఆ పార్సిల్‌లో ప్రీతి పేరు, ఫ్లాట్ నంబరు, మొబైల్ నంబరు ఉండడంతో ఆమె ఆశ్చర్యపోయారు. దొంగ తిరిగి పంపిన బంగారు ఆభరణాల విలువ రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

అంతేకాదు, ఆ బాక్స్‌లోనే ఉన్న మరో చిన్న బాక్స్‌లో ఆ రోజు ఎత్తుకెళ్లిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు కూడా ఉండడం గమనార్హం. హపూర్‌లోని రాజ్‌దీప్ జువెల్లర్స్ నుంచి బాక్స్ వచ్చినట్టు ఉండడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. అక్కడ అలాంటి పేరుతో షాపు లేదని గుర్తించారు. కొరియర్ తీసుకున్న సంస్థ సిబ్బందిని విచారించగా, ఇద్దరు బాలురు వచ్చి దానిని బుక్ చేశారని చెప్పారు. దీంతో పంపిన వారు ఎవరై ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Uttar Pradesh
Thieve
Jewelry
DTDC Courier

More Telugu News