సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసు నిందితులు
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్
- బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 7కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- తెలంగాణ హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో నిందితుల పిటిషన్
- శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించిన సీజేఐ జస్టిస్ లలిత్ బెంచ్
ఇటీవలే హైదరాబాద్ శివారు ప్రాంతం మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి రిమాండ్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా... పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ప్రస్తుతం జైలులో వున్న నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారమే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా...దానిపై విచారణను కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది.
ఈ క్రమంలో నిందితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... ఈ నెల 4న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్ మంగళవారం నేరుగా సీజేఐ జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా... ఆయనే శుక్రవారం నాటి కేసుల జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు.