Jayalalitha: జయలలిత మరణంపై కోవై సెల్వరాజ్ సంచలన వ్యాఖ్యలు

Kovai K Selvaraj Sensational comments on Jayalalitha death
  • జయలలిత మృతిపై వరుసగా వెలుగులోకి వస్తున్న వార్తలు
  • జయకు స్వీట్లు, ఐస్‌క్రీములు ఇచ్చి చంపేశారన్న కోవై సెల్వరాజ్
  • రెండు నివేదికలు వెలుగులోకి వచ్చినా పళనిస్వామి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీత
  • తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇటీవల వరుసగా వార్తలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన అర్ముగస్వామి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ప్రభుత్వానికి కమిషన్ సమర్పించిన నివేదికలోనూ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రోజుకో వార్త బయటకు వస్తోంది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న జయలలిత వైద్యులతో మాట్లాడిన ఆడియో రికార్డు ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, తాజాగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం(ఓపీఎస్) మద్దతుదారుడు కోవై సెల్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జయలలితకు ఐస్‌క్రీములు, స్వీట్లు ఇచ్చి, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. చెన్నైలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అరుణా జగదీశన్ కమిషన్ నివేదిక, అర్ముగస్వామి కమిషన్ నివేదికలను ప్రస్తావించిన ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జయలలిత మృతికి సంబంధించి రెండు నివేదికలు బయటకు వచ్చినా ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడకపోవడం హాస్యాస్పదమన్నారు. ఎడప్పాడితోపాటు తప్పు చేసిన అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

జయలలితను హత్య చేయాలన్న పన్నాగంతో స్వీట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా ఇచ్చారని, ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. మెరుగైన వైద్యం కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని పన్నీర్ సెల్వం నెత్తీనోరు బాదుకున్నా అప్పటి ఆరోగ్యమంత్రి సహా ఎవరూ అంగీకరించలేదని అన్నారు. జయలలిత విషయలో న్యాయం జరగకుంటే ఆమె సమాధి వద్ద కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని సెల్వరాజ్ హెచ్చరించారు.
Jayalalitha
Tamil Nadu
Edappadi K. Palaniswami
O. Panneerselvam
Kovai K Selvaraj

More Telugu News