BJP: జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఏపీకి శాపంగా మారాయి: బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌

  • తిరుప‌తిలో బీజేపీ ప్ర‌జాపోరులో పాల్గొన్న ల‌క్ష్మ‌ణ్‌
  • 3 రాజ‌ధాను‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆరోప‌ణ‌
  • జ‌గ‌న్ వ‌ల్లే విభ‌జ‌న చ‌ట్టం నీరుగారుతోంద‌ని విమ‌ర్శ‌
  • కుటుంబ పార్టీల‌కు తెలంగాణ‌లో స్థానం లేదన్న బీజేపీ ఎంపీ
bjp mp laxman comments on ysrcp and trs governmnets

తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వైసీపీ, టీఆర్ఎస్‌ల‌పై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్ గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఏపీ శాఖ చేప‌ట్టిన ప్రజాపోరులో భాగంగా గురువారం తిరుప‌తిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ల‌క్ష్మ‌ణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీలో వైసీపీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఏపీకి శాపంగా మారాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఫ‌లితంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింద‌న్నారు. 3 రాజ‌ధానుల‌తో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారన్న ల‌క్ష్మ‌ణ్‌... రాజ‌ధానిని అట‌కెక్కించారని, అమ‌రావ‌తి రైతుల‌పై కత్తి కట్టారని విమర్శించారు.  

జ‌గ‌న్ వైఖ‌రి వ‌ల్లే ఏపీ పున‌ర్విభ‌జ‌న‌ చ‌ట్టం నీరుగారిపోతోందని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. ఏపీ ప్ర‌భుత్వం రూ.8 ల‌క్ష‌ల కోట్ల మేర అప్పులు చేసిందని, ఫ‌లితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌న్నారు. ఏపీతో పాటు తెలంగాణ‌లోనూ కుటుంబ పాల‌న‌లు సాగుతు‌న్నాయని ఆయ‌న అన్నారు. కేసీఆర్ నాలుగేళ్లుగా జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల డ‌బ్బు, న‌ల్ల‌ధ‌నంతో రాజకీయాలు చేయాల‌ని కేసీఆర్ చూస్తున్నారని విమ‌ర్శించారు. కుటుంబ పార్టీల‌కు తెలంగాణ‌లో స్థానం లేదని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News