Dog: పైశాచికత్వానికి పరాకాష్ఠ .. కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్: వీడియో ఇదిగో

  • రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘటన
  • డాక్టర్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు
  • శునకం కాళ్లకు ఫ్యాక్చర్లు
  • డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద కేసు నమోదు
Video Shows Dog Tied To A Car Being Dragged In Jodhpur

పైశాచికత్వానికి పరాకాష్ఠ అంటే ఇదేనేమో. ఓ కారు డ్రైవర్ కుక్క మెడకు తాడు కట్టి ఆపై కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో మరోమార్గం లేని శునకం దాని వెనక పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఈ ఘటనలో మరో దారుణం ఏంటంటే.. కుక్క మెడకు తాడు కట్టి కారుతో ఈడ్చుకెళ్లిన ఆ వ్యక్తి డాక్టర్ కావడం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కారు వెనుక వెళ్తున్న బైకర్ ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బైకర్ వేగం పెంచి కారుకు అడ్డంగా తన బైకును నిలిపి శునకాన్ని రక్షించాడు.

రద్దీ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్టు వీడియోను బట్టి తెలుస్తోంది. కుక్క మెడకు పొడవైన తాడు కట్టడంతో అది రోడ్డుకు  అటు ఇటు పరిగెత్తుతూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. బైకర్ కారును ఆపిన వెంటనే గుమిగూడిన స్థానికులు వెంటనే కుక్క మెడకు ఉన్న తాడును తొలగించారు. మరికొందరు ఎన్‌జీవోకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో వారొచ్చి దానిని ఆసుపత్రికి తరలించారు. 

డాగ్ హోం ఫౌండేషన్ అనే ఎన్‌జీవో ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. శునకాన్ని కారుతో ఈడ్చుకెళ్లిన ఆ డాక్టర్ పేరును రజనీష్ గల్వాగా పేర్కొంది. ఆ వీధికుక్క నిత్యం తన ఇంటి వద్దే కాపుకాస్తుండడంతో దానిని వదిలించుకోవడానికే ఇలా చేసినట్టు రజనీష్ పేర్కొన్నాడు. కాగా, శునకం కాళ్లకు పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్టు ఎన్‌జీవో పేర్కొంది. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని ట్యాగ్ చేసింది. ఆ తర్వాత డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని కూడా షేర్ చేసింది.

More Telugu News