ఎవరేం అనుకున్నా సరే.. టీ20ల్లో అతనే నం.1 ఆల్‌రౌండర్ అంటున్న రవిశాస్త్రి
- టీ20 ఫార్మాట్ లో హార్దిక్ పాండ్యానే నం.1 అని పునరుద్ఘాటన
- ఇతరుల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదన్న శాస్త్రి
- ఆసియా కప్ లో నిరాశ పరిచిన హార్దిక్
‘ఈ ఫార్మాట్‌లో అతను నంబర్ 1 ఆల్ రౌండర్ అని నేను ఇప్పటికే ట్వీట్ చేశా. ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంకా ఏమి కావాలి? నేను రెండు వారాల క్రితమే నా అభిప్రాయం చెప్పాను. దీని గురించి కూడికలు, తీసివేతలు ఎందుకు? ఎవరేం అనుకున్నా సరే నా అభిప్రాయం స్పష్టంగా ఉంది. పాండ్యానే నం.1 ఆల్ రౌండర్. ఈ విషయం నేను కొన్ని వారాల క్రితం ట్వీట్ చేశాను’ అని శాస్త్రి పేర్కొన్నాడు. పాండ్యా బౌలింగ్ విషయంలో ఈ మధ్య కొందరు మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శాస్త్రి ఈ కామెంట్లు చేశారు.
ఇటీవల, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ హార్దిక్‌ను నాలుగో మీడియం పేసర్‌గా జట్టులోకి తీసుకోవాలని, మూడో పేసర్ గా అతను సరిపోడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్లలో కేవలం ఒక వికెట్‌తో 44 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యాను ప్రధాన పేసర్గా ఉపయోగించకూడదని మంజ్రేకర్ చెప్పాడు. ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో పాక్ పై భారత్ ను ఒంటి చేత్తో గెలిపించిన పాండ్యా తర్వాత నాలుగు మ్యాచుల్లో నిరాశ పరిచాడు.