అమరావతి రైతుల పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. 12న వేకువజామున 5 గంటలకు ప్రారంభం
- వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
- 9 గంటలకు రథానికి జెండా ఊపి యాత్ర ప్రారంభం
- తొలి రోజు వెంకటపాలెం నుంచి మంగళగిరికి చేరుకోనున్న యాత్ర
ఈ నెల 12న వేకువ జామున 5 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ముందుగా వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. యాత్ర తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.