Cholesterol: హై కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సాయపడే డ్రింక్స్ ఇవే!

  • గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ ముప్పు 
  • రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం
  • నాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం 
Drinks that helps to reduce high cholesterol levels

శరీరంలో కణాల అభివృద్ధికి, హార్మోన్ల తయారీకి ఉపకరించే పదార్థం కొలెస్ట్రాల్. అయితే ఇది మితిమీరితే ఎంతో ప్రమాదకరం. హై కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి. తద్వారా నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దాంతో, రక్తాన్ని సరఫరా చేసే క్రమంలో గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. తీవ్ర పనిభారం కారణంగా హృదయం కొద్దికాలంలోనే బలహీనపడుతుంది. 

ఈ నేపథ్యంలో, హృద్రోగాలకు గురికావడం, గుండెపోటు వంటి తీవ్ర పరిణామాలు సంభవించడం జరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడంతో పాటు మంచి ఆహారం, కంటినిండా నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, మానసికంగా ఉల్లాసంగా ఉండడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. కాగా, కొన్ని రకాల పానీయాల సాయంతో హై కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


ఆ పానీయాలు ఏవంటే...

1. సోయా మిల్క్

సోయా పాలలో కొవ్వు (Saturated Fat) తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయులను నియత్రించాలనుకునేవారు అధిక కొవ్వు ఉండే పాలు, పాల పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా సోయా మిల్క్ ను ఉపయోగించవచ్చు. అయితే, తాజా సోయా మిల్క్ నే కొనుగోలు చేసి వాడాలి. అందులో అదనపు చక్కెర, ఉప్పు, ఇతర కొవ్వులు లేకుండా చూసుకోవాలి. సోయా మిల్క్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరమైనది. 

మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు 25 గ్రాముల సోయా ప్రొటీన్ తీసుకోవాలని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) చెబుతోంది. గుండె జబ్బుల బారినపడే అవశాలను ఇది బాగా తగ్గిస్తుంది.

2. టమాటా జ్యూస్

శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించేందుకు, హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులను పెంచేందుకు టమాటాల్లోని ఐసోపేన్ అనే పదార్థం దోహదపడుతుంది. అంతేకాదు, టమాటాల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే పీచు పదార్థంతో పాటు నియాసిన్ కూడా లభ్యమవుతుంది. 

రెండు నెలల పాటు రోజుకు 280 మిలీ టమాటా జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన 25 మంది మహిళలపై ఈ మేరకు అధ్యయనం చేపట్టగా సత్ఫలితాలు వచ్చాయని 2015 నాటి అధ్యయనం చెబుతోంది.

3. ఓట్స్ పానీయాలు

బీటా గ్లూకాన్స్ మెండుగా ఉండే వాటిలో ఓట్స్ ముఖ్యమైనవి. వీటిలోని జెల్ వంటి పదార్థం పిత్త లవణాలతో ప్రభావితం చెందడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపకరిస్తుంది. 

ఒకవేళ ప్యాక్ చేసిన ఓట్స్ పానీయాలు కొనుగోలు చేస్తుంటే వాటిలో బీటా గ్లూకాన్స్ ఉంటేనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ లేబుల్ పై ముద్రించి ఉండే లేబుల్ లో పీచు పదార్థం, ఇతర పదార్థాల వివరాలను తనిఖీ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

4. గ్రీన్ టీ

మనలో చాలామంది గ్రీన్ టీ తీసుకుంటుంటారు. ఇది కూడా కొలెస్ట్రాల్ ను అదుపు చేయడంలో విశేషంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్, ఎపిగాల్లోకాటెచిన్ గల్లాటే, తదితర ప్రయోజనకారకాలైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు ఎల్డీఎల్ ను తగ్గించడమే కాకుండా, ఓవరాల్ గా కొలెస్ట్రాల్ స్థాయులను కట్టడి చేస్తుంది. 

2015లో దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేపట్టారు. కాటెచిన్, ఎపిగాల్లో కాటెచిన్ గల్లాటే కలిపిన నీటిని ఎలుకలకు 56 రోజుల పాటు తాగించారు. ఆశ్చర్యకరంగా వాటిలో ఓవరాల్ కొలెస్ట్రాల్ స్థాయి 14.4 శాతానికి తగ్గిపోగా, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి 30.4 శాతానికి దిగొచ్చింది.

5. కోకోవా పానీయాలు

మానవ ఆరోగ్యానికి కీలకమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పానీయాల్లో కోకోవా డ్రింక్స్ కూడా ఉంటాయి. కోకోవా పానీయాల్లోని ఫ్లేవనాల్స్ (ఫ్లేవనాయిడ్స్ సబ్ గ్రూప్) ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను సమతుల్యంగా ఉండేట్టు చూస్తాయి. కోకోవా డ్రింక్స్ లో అత్యధిక స్థాయిలో మోనా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. డార్క్ చాక్లెట్ లో ప్రధాన పదార్థం కోకోవానే. 

అయితే, కోకోవా డ్రింక్స్ తీసుకునే సమయంలో వాటిలో చక్కెర, ఉప్పు, ఇతర కొవ్వులు లేకుండా చూసుకోవాలి. నెల రోజుల పాటు రోజుకు రెండుసార్లు 450 ఎంజీ ఫ్లేవనాల్స్ తో కూడిన కోకోవా డ్రింక్ తీసుకుంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా, హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులను పెంపొందిస్తుంది.

More Telugu News