Gujarat: బీజేపీలోనే ఉండి ముడుపులు తీసుకోండి.. ఆప్​ కోసం పనిచేయండి: గుజరాత్​ లో కేజ్రీవాల్ పిలుపు

Stay in bjp but work for AAP says Arvind kejriwal
  • ఇన్నాళ్లుగా సేవ చేసిన కార్యకర్తలకు బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్న
  • తమ పార్టీలో కార్యకర్తలు అత్యుత్తమ సేవలు పొందుతారన్న కేజ్రీవాల్
  • గుజరాత్ లో బీజేపీ దుష్పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య
గుజరాత్ లో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో చేరేందుకు వస్తున్నారని.. అలాంటి వారంతా బీజేపీలోనే ఉండి ఆప్ తరఫున పనిచేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇన్నేళ్లుగా సేవలు చేస్తున్న కార్యకర్తలకు బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ నుంచి ముడుపులు తీసుకోవాలని, కానీ ఆప్‌ కోసం పనిచేయాలని కోరారు. త్వరలో గుజరాత్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేజ్రీవాల్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సూరత్ లో నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడారు.

మేం ముడుపులు ఇవ్వలేం.. అత్యుత్తమ సేవలు చేస్తాం
క్షేత్రస్థాయిలో పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఆప్ లో చేరుతున్నారని.. వారు ఆప్ లో చేరాల్సిన అవసరం లేదని, ఆ పార్టీలోనే ఉంటూ ఆప్ కోసం పనిచేయాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీలో చాలా మందికి ఆ పార్టీ నుంచి ముడుపులు అందుతాయని.. అలా ఇచ్చేంత డబ్బు తమ దగ్గర లేదని కేజ్రీవాల్ చెప్పారు. కానీ గుజరాత్ లో ఆప్‌ అధికారంలోకి వచ్చాక.. బీజేపీ కార్యకర్తలకు కూడా తమ పార్టీ అందించే ఉత్తమ సేవలు అందుతాయని పేర్కొన్నారు. తాము నాణ్యమైన విద్య, వైద్యం, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని.. అందరితోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ప్రయోజనాలు పొందుతారని వ్యాఖ్యానించారు.

బీజేపీకి ఓటమి భయం
బీజేపీకి గుజరాత్ లో ఓటమి భయం పట్టుకుందని.. ఏం చేయాలో తెలియకే తమ పార్టీ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలాంటి వాటికి తాము భయపడబోమని, అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతామని ప్రకటించారు.
Gujarat
BJP
AAP
Arvind Kejriwal
national
Politics

More Telugu News