స్టేడియంలో గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టేడియంలో గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో ఇదిగో

Kinchit Shah Proposes to His Girlfriend at Dubai Stadium
  • భారత్-హాంకాంగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఘటన
  • స్టేడియంలో నిల్చున్న ప్రేయసి వద్దకు వెళ్లి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చిన కించిత్ షా
  • ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘యస్’ చెప్పిన ప్రియురాలు
క్రికెటర్ల రికార్డులకు స్టేడియాలు సాక్షిగా నిలవడమే కాదు.. వారి ప్రేమ బంధాలకు కూడా సాక్షీభూతంగా నిలుస్తాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తాము మనసిచ్చిన ప్రేయసి/ప్రియుడికి అభిమానులు పెళ్లి ప్రపోజ్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ, ఆసియాకప్‌లో భాగంగా భారత్-హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా స్టేడియంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఆమెను సంభ్రమాశ్చర్యాలలోకి నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సూపర్-4లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కించిత్ షా 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముంబైలో పుట్టిన కించిత్ మూడు నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి హాంకాంగ్ వెళ్లిపోయాడు. తండ్రి క్రికెట్ ఆడుతుండడాన్ని చూసి పదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తాజాగా, భారత్‌తో మ్యాచ్ ముగిశాక స్టేడియంలో నిల్చున్న గాళ్ ఫ్రెండ్ వద్దకు వెళ్లిన కించిత్ మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ రొమాంటిక్ ప్రపోజల్ ట్విట్టర్‌కెక్కి హల్‌చల్ చేస్తోంది.

ఉంగరం చూపించి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న కించిత్‌ను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయిందామె. ఆశ్చర్యం నుంచి తేరుకున్న ఆమెకు తన అంగీకారాన్ని తెలిపేందుకు ఎంతోసేపు పట్టలేదు. ‘యస్’ అంటూ తన సమ్మతి తెలిపింది. ఆ వెంటనే ఇద్దరూ కౌగిలించుకుని ఆనందంలో మునిగి తేలారు. వెంటనే అక్కడున్న ప్రేక్షకులు తమ కెమెరాలు, సెల్‌ఫోన్లకు పనిచెప్పారు. ఈ ప్రపోజల్ వీడియోను ఆసియా కప్‌ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. మీరూ చూసేయండి మరి!
Kinchit Shah
Hong Kong
Girlfriend
Dubai Stadium

More Telugu News