Team India: టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్​ శర్మ

Rohit Sharma Surpasses Martin Guptil to Become Highest Run Scorer in T20 Internationals
  • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులతో రికార్డు
  • న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను అధిగమించిన రోహిత్
  • తొలి టీ20లో వెస్టిండీస్ పై  భారత్ గెలుపు 
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. వెస్టిండీస్ జట్టుతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. 

ఈ క్రమంలో ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 3443 పరుగులు ఉన్నాయి. దాంతో, ఈ ఫార్మాట్ లో ఇప్పటిదాకా అత్యధిక పరుగులతో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును అధిగమించాడు. గప్టిల్ 3399  పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు.  భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3308 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఈ ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. రోహిత్ 129 అంతర్జాతీయ టీ20 ల్లో నాలుగు శతకాలు, 26 అర్ధ శతకాలు సాధించాడు. మార్టిన్ గప్టిల్ 116 మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటిదాకా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ, అతని ఖాతాలో 30 అర్ధ శతకాలున్నాయి. 

కాగా,  రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు, వెటరన్ బ్యాటర్ దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌) సూపర్‌ ఫినిషింగ్‌ ఇవ్వడంతో.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 68 రన్స్‌ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది.  
Team India
Rohit Sharma
t20i
highest runs
Virat Kohli

More Telugu News