Anand Mahindra: యూకే సంక్షోభంపై ఆనంద్ మహీంద్రా చమత్కారం!

  • బ్రిటిష్ సంక్షోభానికి దేశీ హాస్యం తోడైందన్న ఆనంద్ మహీంద్రా
  • ట్విట్టర్ లో 10 డ్రౌనింగ్ స్ట్రీట్ ఫొటో షేర్
  • దానిపై స్వస్తిక్ గుర్తులు, మామిడి తోరణాల దర్శనం
Anand Mahindra take on UK crisis is all about desi humour

బ్రిటన్ లో రాజకీయ సంక్షోభాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు కీలక మంత్రులు రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో కొత్త ప్రధాని ఎంపికపై అక్కడ కసరత్తు నడుస్తోంది. ప్రధాని పోటీలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ కూడా ఉన్నారు. ప్రతీ అంశంపై భిన్నంగా, విలక్షణంగా స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా..  బ్రిటన్ సంక్షోభంపైనా హాస్యభరితంగా ట్వీట్టర్లో పోస్ట్ పెట్టారు.

బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసమైన 10 డ్రౌనింగ్ స్ట్రీట్ ఫొటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆనంద్ పోస్ట్ చేసిన ఫొటోను గమనిస్తే..  డోర్ పైన మామిడి తోరణాలను కట్టి ఉండడం.. ద్వారానికి రెండు వైపులా కమ్మీలపై స్వస్తిక్ ముద్రలు ఉండడం కనిపిస్తోంది. ‘10డ్రౌనింగ్ స్ట్రీట్ భవిష్యత్తు? ప్రసిద్ధ బ్రిటిష్ హాస్యం ఇప్పుడు దేశీ హాస్యంతో ముడిపడి ఉంది’ అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. 

ఈ పోస్ట్ కు ఆయన ఫాలోవర్లు కూడా భిన్నంగానే స్పందించారు. కలశం మిస్ అయిందని.. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కూడా మిస్సయ్యాయంటూ ఫొటోలతో వారు కామెంట్ పెట్టడాన్ని గమనించొచ్చు. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాకుల్లో ఒకరైన నారాయణమూర్తికి స్వయానా అల్లుడు.

More Telugu News