Nadendla Manohar: సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు: నాదెండ్ల మనోహర్

  • మేనిఫెస్టో అమలు చేశామన్న సీఎం జగన్ 
  • గడపగడపకు విజయవంతమైందని వ్యాఖ్యలు
  • నిజమే అయితే ముందస్తు ఎన్నికలు పెట్టాలని డిమాండ్
Nadendla Manohar slams CM Jagan

వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారని, అందుకే తమ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లి మేనిఫెస్టో చూపించి తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోగలుగుతున్నారని సీఎం జగన్ ఇవాళ ప్లీనరీలో వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. సీఎం జగన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని వెల్లడించారు. 

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పుకోవడం సరికాదని అన్నారు. గడపగడపకు కార్యక్రమం విఫలం కావడంతో సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక రూ.1.27 లక్షలతో రైతులను ఆదుకున్నట్టు జగన్ అంటున్నారని, అదే నిజమైతే వైసీపీ పాలనలో 3 వేల మంది రైతులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడినట్టు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. 

ప్రతి మహిళ ఖాతాలో రూ.37 వేలు జమ చేశామని చెబుతున్నారని, అయితే డ్వాక్రా మహిళల సొమ్ము రూ.2 వేల కోట్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు. నిజంగానే మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశారా? అయితే మీకు దమ్ముంటే మార్చి లేక ఏప్రిల్ లో ఎన్నికలు జరపండి అని డిమాండ్ చేశారు. ఓవర్ స్పీడు తిరిగితే ఫ్యాను విరిగి కిందపడుతుందని నాదెండ్ల వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News