Kerala: దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ.. ఏరికోరి కావాల్సిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లిన దొంగలు!

Thieves opt for pick and choose method while robbing kitchenware
  • కేరళలోని త్రిస్సూరులో ఘటన
  • గ్యాస్ స్టౌవ్, గొడుగు, టేబుల్ మ్యాట్లు వంటి వాటిని మాత్రమే ఎత్తుకెళ్లిన వైనం
  • వెళ్తూవెళ్తూ క్యాష్ కౌంటర్‌లోని రూ. 3 వేలు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన చోరులు
అర్ధరాత్రి వేళ ఓ దుకాణంలోకి చొరబడిన దొంగలు ఏరికోరి కావాల్సిన వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లారు. కళ్లముందు బోల్డన్ని వస్తువులు ఉన్నా వాటి వంక కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. కేరళలోని త్రిస్సూరులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ వెరైటీ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొత్తం ముగ్గురు దొంగలు అర్ధరాత్రి వేళ దుకాణం వద్దకు ఆటోలో వచ్చారు. వారిలో ఇద్దరు లోపలికి వెళ్లగా, బయట ఒకడు కాపలాగా ఉన్నాడు. లోపలికి చొరబడిన దొంగలు గ్యాస్ స్టౌ, టేబుల్ మ్యాట్లు, గొడుగు వంటి ఇంటికి అవసరమైన వస్తువులను చోరీ చేశారు. అనుకున్న వస్తువులన్నీ తీసుకున్నామని నిర్ధారించుకున్న తర్వాత ఓ దొంగ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న రూ. 3 వేల నగదు, ఓ మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నాడు. 

బయట కాపలాగా ఉన్న మూడో దొంగ.. వారు బయటకు తీసుకొచ్చిన వస్తువులను ఆటోలో నింపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు మొత్తం రూ. 80 వేల విలువైన వస్తువులను చోరీ చేసినట్టు షాపు యజమాని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kerala
Thieves
Thrissur
Kitchenware

More Telugu News