జనసేన కొత్త కార్యక్రమం 'జన వాణి'... ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
- సామాన్యుడి గళం వినిపించేలా జన వాణి
- ఐదు వారాల పాటు నిర్వహణ
- తొలి రెండు వారాలు విజయవాడలో!
- ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో కార్యక్రమం
జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో తొలి విడత 'జన వాణి' నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో ఆదివారం కూడా విజయవాడలోనే 'జన వాణి' ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో జన వాణి ఉంటుంది.
కాగా, విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తారు. అంతేకాదు, అదే రోజు సాయంత్రానికి ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరేట్టు ప్రయత్నిస్తారు. ఆపై, తమ కార్యాలయం నుంచి ఆ అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తారు.
రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ తో చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఈ 'జన వాణి' కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.