Tollywood: నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి

  • జులై 8 నుంచి  జులై 22కి వాయిదా పడిన విడుదల
  • విజయ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న  థాంక్యూ’
  • హీరోయిన్లుగా రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ 
ThankYou  Movie in Theatres on July 22nd

తండ్రి నాగార్జునతో కలిసి ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగ చైతన్య అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత సమంతతో విడాకులతో వ్యక్తిగత జీవితంలోనూ చైతూకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా ‘థాంక్యూ’తో మంచి విజయం సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అక్కినేని నట వారసుడు. 

 ‘మనం’ చిత్రంతో తమ కుటుంబానికి చిరకాలం గుర్తిండిపోయే విజయం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంతో వస్తున్న ‘థ్యాంక్యూ’పై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. జులై 8 న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్  ముందుగా తెలిపింది. కానీ, ఇప్పుడు చిత్రం రెండు వారాలు వాయిదా పడింది. జులై 22వ తేదీన విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దాంతో, చైతూను మళ్లీ వెండితెరపై చూడాలంటే అతని అభిమానులు ఇంకాస్త వేచి చూడాల్సిందే. 

 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. చైతూ సరసన రాశీఖన్నాతో పాటు మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టీజర్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.

More Telugu News