Madhavan: దక్షిణాది సినిమాలు ఎందుకు బాగా ఆడుతున్నాయని విశ్లేషించడం అర్థరహితం: మాధవన్

  • ఇటీవల బాలీవుడ్ ను దున్నేస్తున్న సౌత్ సినిమాలు
  • కలెక్షన్ల వర్షం కురిపించిన ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్-2 
  • ఉత్తరాది, దక్షిణాది సినిమాల చర్చ అవివేకమన్న మాధవన్
Madhavan says it is useless to discuss how south cinema gets more success at north

ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు జాతీయ స్థాయిలో మోత మోగిస్తున్నాయి. బాహుబలితో మొదలుపెట్టి పుష్ప, కేజీఎఫ్-2 వరకు బాలీవుడ్ ను సైతం ఊపేశాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్-2, పుష్ప చిత్రాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దాంతో, దక్షిణాది చిత్రాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకోవడం అధికమైంది. దీనిపై ప్రముఖ నటుడు మాధవన్ స్పందించారు. 

ఉత్తరాది సినిమా, దక్షిణాది సినిమా అంటూ సాగుతున్న చర్చలోకి దూరడం అర్థరహితమని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటుందని, ఏ చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారో ఎవరూ ఊహించలేరని అన్నారు. దక్షిణాది సినిమాలు హిందీ ఎక్కువగా మాట్లాడే ఉత్తరాదిన ఎందుకు బాగా ఆడుతున్నాయని విశ్లేషించాలనుకోవడం అవివేకం అని మ్యాడీ పేర్కొన్నారు. 

స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో మాధవన్ పైవ్యాఖ్యలు చేశారు. విజయానికి ఓ ఫార్ములా ఉంటుందని ఎవరైనా భావిస్తే, నిరంతరం మార్పులకు లోనయ్యే పరిశ్రమలో ప్రతిదీ కోల్పోవాల్సి ఉంటుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఒక భాషా చిత్రాలు మరో భాషలో బాగా ఆడడం సాధారణ విషయంగా మారిపోతుందని అనుకుంటున్నానని మాధవన్ వ్యాఖ్యానించారు. 

దక్షిణాది చిత్రాలకు అధిక ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో, బాక్సాఫీసు వద్ద బాలీవుడ్ చిత్రాలు రాణించలేకపోతున్నాయని అభిప్రాయపడడం సబబు కాదని అన్నారు.  బాలీవుడ్ లో ఈ ఏడాది గంగూబాయి కథియావాడి, ది కశ్మీర్ ఫైల్స్, భూల్ భులాయియా-2 చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయని వివరించారు. 

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం ప్రేక్షకులు సినిమాను స్వీకరించే దృక్కోణాన్ని మార్చివేసిందని మాధవన్ అభిప్రాయపడ్డారు. అయితే, దక్షిణాది నటులు కఠోరశ్రమను తక్కువ చేసి చెప్పలేమని, ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కానీ, పుష్పలో అల్లు అర్జున్ కానీ ఎంతో అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు.

More Telugu News