Indian Air Force: అగ్నిపథ్ అర్హతలు ఇవే.. పథకం వివరాలు విడుదల

Indian Air Force releases details on Agnipath recruitment Eligibility benefits
  • భిన్నమైన యూనిఫామ్ 
  • 17.5-21 ఏళ్ల వరకు అర్హత
  • మొదటి ఏడాది ప్రతి నెలా రూ.30,000 
  • రెండో ఏడాది నుంచి ఏటా 10 శాతం పెంచి చెల్లింపు
  • నాలుగేళ్ల తర్వాత రూ.10.04 లక్షలతోపాటు వడ్డీ చెల్లింపు
ఒకవైపు నిరసనకారులు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక పథం వీడలేదు. మరోవైపు ఈ పథకం కింద నాలుగేళ్ల పాటు అగ్నివీర్ గా దేశానికి సేవలు అందించే పథకం వివరాలను కేంద్రం ప్రకటించింది. ఎయిర్ ఫోర్స్ ఈ వివరాలను ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్హతల వివరాలు, ఉండాల్సిన ఆరోగ్య ప్రమాణాలు, సెలవులు, పారితోషికం, జీవిత బీమా కవరేజీ ఇలా సమగ్రమైన వివరాలు ఇందులో ఉన్నాయి.

ఎయిర్ ఫోర్స్ పరిధిలో అగ్నివీర్ వివరాలను పరిశీలిస్తే.. వీరు భిన్నమైన యూనిఫామ్ తో ఉంటారు. అవార్డులకు, సత్కారాలకు అర్హులు. ఒక్కో అగ్నివీర్ కు సంబంధించిన నైపుణ్యాలు, అర్హతలు, సమస్త వివరాలతో ఆన్ లైన్ డేటాబేస్ నిర్వహిస్తారు. 

17.5 నుంచి 21 ఏళ్ల వరకు అగ్నివీర్ కోసం పోటీపడొచ్చు. అన్ని రకాల షరతులను అంగీకరించాలి. 18 ఏళ్లలోపు (17.5 నుంచి 18ఏళ్లు నిండని వయసులోని వారు) వారికి తల్లిదండ్రులు షరతులు, అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది.

నాలుగేళ్ల సర్వీసు తర్వాత వారిని విడుదల చేస్తారు. వారిలో అత్యంత ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించిన వారికి తిరిగి ఐఏఎఫ్ రెగ్యులర్ కేడర్ కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తారు. రెగ్యులర్ కేడర్ లో వీరికి 25 శాతం కోటా ఉంటుంది. ఇతర అభ్యర్థులతో సమానంగా పోటీపడి గెలవాల్సి ఉంటుంది. 

ఆరోగ్య పరంగా నిర్దేశించిన ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆరోగ్య సమస్యలు, కంటి చూపు సమస్యలు ఉండకూడదు. అగ్నివీర్ గా ఎంపికైన వారికి ఐఏఎఫ్ లో ఏ బాధ్యతలను అయినా అప్పగిస్తారు.

ఏడాదికి 30 రోజులు సెలవుగా ఇస్తారు. సిక్ లీవ్ అదనం. పనిచేస్తున్న కాలంలో వైద్య సదుపాయాలు ఉచితం. అసాధారణ కేసుల్లో తప్పించి నాలుగేళ్లు పూర్తి కాకుండా అగ్నివీర్ లు ఉద్యోగం నుంచి వెళ్లిపోవడానికి అనుమతించరు. 

మొదటి ఏడాది రూ.30,000 చెల్లిస్తారు. ఇందులో 70 శాతం అంటే రూ.21,000 చేతికి వస్తుంది. మిగిలిన 30 శాతం అంటే రూ.9,000 కార్పస్ కిందకు వెళుతుంది. ప్రభుత్వం కూడా తన వంతుగా రూ.9,000ను ఒక్కో అగ్నివీర్ తరఫున కార్పస్ ఫండ్ కు ఇస్తుంది. రెండో ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున వేతనాన్ని పెంచి చెల్లిస్తారు. అంటే రెండో ఏడాది రూ.33,000 లభిస్తుంది. దీనిలో 70 శాతం రూ.23,100 చేతికి వస్తుంది. రూ.9,900 కార్పస్ కిందకు వెళుతుంది. ప్రభుత్వం కూడా అంతే వాటా ఇస్తుంది. 

ఇలా నాలుగేళ్లలో అగ్నివీర్ తన వంతు రూ.5.02 లక్షలు పొదుపు చేస్తాడు. ప్రభుత్వం కూడా ఇంతే మొత్తాన్ని అందిస్తుంది. నాలుగేళ్ల తర్వాత రూ.10.04 లక్షలు, దీనికి వడ్డీ కలిపి చెల్లిస్తారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఉండదు.
Indian Air Force
releases
Agnipath
recruitment
Eligibility
DETAILS

More Telugu News