Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యాలో అన్ని కార్యకలాపాలకు స్వస్తి పలికిన ఐబీఎం

IBM halts all activities in Russia
  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • రష్యాలో వ్యాపార లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు
  • పెరిగిపోతున్న అనిశ్చితి
  • ఐబీఎం రష్యా విభాగం మూసివేత
  • ఉద్యోగులను తొలగించేందుకు ఐబీఎం నిర్ణయం
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో... రష్యాలో కార్యకలాపాలు కష్టసాధ్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తమ ఉద్యోగులకు లేఖ రాశారు. అంతేకాదు, ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కూడా మొదలైందని సంకేతాలు ఇచ్చారు.

కొన్ని ప్రాంతాల్లో తమ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కూడా తమకు ముఖ్యమేనని, గత కొన్నినెలలుగా ఈ అంశంపైనే కంపెనీ దృష్టి సారించిందని అరవింద్ కృష్ణ వివరించారు. గత మార్చి నుంచే రష్యాలో తమ వ్యాపారం నిలిచిపోయిందని, అయితే ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లించామని స్పష్టం చేశారు. కార్యకలాపాలు లేకపోయినా రష్యాలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలిక ఐచ్ఛికాలను పరిశీలిస్తున్నామని వివరించారు. 

యుద్ధ పర్యవసానాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయని, యుద్ధం శాఖోపశాఖలుగా విస్తరిస్తుండడంతో అనిశ్చితి, తత్సంబంధిత పరిణామాలు దీర్ఘకాలంలో పెరుగుతాయని అరవింద్ కృష్ణ పేర్కొన్నారు. ఐబీఎం విభాగం మూసివేత నిర్ణయం రష్యాలోని తమ ఉద్యోగులకు కష్టంగానే ఉంటుందన్న విషయం తెలుసని, వారికి కంపెనీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ఉద్యోగుల తప్పేమీలేదని, నెలల తరబడి అనిశ్చితి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రష్యాలో తమ ఉద్యోగుల తదుపరి ఉపాధి దిశగా కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటుందని తన లేఖలో వివరించారు.
IBM
Russia
Activities
Employees
Ukraine

More Telugu News