APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు.. దేశంలోనే తొలిసారి!

APSRTC Ready To Introduce EPos Machines
షార్ట్స్‌లో చూడండి
ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. బస్సుల్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని నిర్ణయించిన ఆర్టీసీ.. ఇందుకోసం విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది.

ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో గత మూడు రోజులుగా వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల స్పందనను బట్టి దశల వారీగా మిగతా బస్సుల్లోనూ వీటిని అమలు చేయాలని యోచిస్తున్నారు. మిషన్ల ఉపయోగంపై  కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఇక్సిగో-అభిబస్ సంస్థ ఈ యంత్రాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం 50 ఈ-పోస్ మిషన్లను అందించింది. త్వరలోనే మరిన్ని అందించనుంది. ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు అంటే.. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టికెట్ ధర చెల్లించుకోవచ్చు. నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ మిషన్ల ద్వారా చిల్లర సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. 

అలాగే, మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్ల ఖాళీలను బట్టి ‘స్టేజ్ టు టికెట్’ ఇష్యూ అవకాశం కూడా కల్పించారు. బస్సు రూట్‌ ట్రాకింగ్‌ను యాప్‌లో చూసుకోవచ్చు. అయితే, ఈ మిషన్ ఎప్పుడూ చార్జింగ్‌లోనే ఉండాలి. ఈ-పోస్ మిషన్‌లోని సిమ్‌కార్డు నెట్‌వర్క్ పనిచేయకుంటే ఉపయోగించుకునేలా ‘టిమ్’ కూడా అందుబాటులో ఉంటుంది. సాధారణ టికెట్లతో పాటు సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులకు కూడా రాయితీలు యథావిధిగానే లభిస్తాయి.
Go Back to Shorts
APSRTC
E-Pos
Vijayawada
Guntur-2
Andhra Pradesh

More Telugu News