Tamil Nadu: తన భార్యగా భ్రమించి మరో మహిళను హత్య చేసిన వ్యక్తి!

Man mistakenly murders stranger for wife In Tamil Nadu
  • తన భార్య చనిపోవడంతో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్న నిందితుడు
  • మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన రెండో భార్య
  • ఆమెను చంపేందుకు పథకం
  • చీకట్లో ఆమెకు బదులుగా మరొకరిని హతమార్చిన వైనం
  • పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
భార్యతో మనస్పర్థలు కారణంగా ఆమెను చంపాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి ఆమెకు బదులుగా మరో మహిళను హత్య చేశాడు. తమిళనాడులోని తిరువణ్నామలైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన దేవేంద్రన్ (55) పశువుల వ్యాపారి. మొదటి భార్య రేణుకామ్మాళ్ రెండేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మిని ఐదు నెలల క్రితం దేవేంద్రన్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో తరచూ గొడవపడేవారు. దీంతో మనస్తాపం చెందిన ధనలక్ష్మి ఇటీవల అంబూరులోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

మరోవైపు, అంబూరు కంబికొల్లైకి చెందిన జాన్ బాషా కుమారుడు నవీద్ బాషా ఓ చోరీ కేసులో అరెస్టై వేలురు సెంట్రల్ జైలులో ఉన్నాడు. దీంతో దిక్కు కోల్పోయిన అతడి భార్య గౌసర్‌ తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి అంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ వద్ద జీవిస్తోంది. ఇంకోవైపు, ధనలక్ష్మిని హత్య చేయాలని పథకం పన్నిన దేవేంద్రన్ ఆమె కోసం ఆరా తీశాడు. ఆమె అంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటుందని తెలుసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధ రాత్రి అక్కడికి చేరుకున్న దేవేంద్రన్.. చీకట్లో తన భార్య అనుకుని గౌసర్‌ను కత్తితో గొంతుపైనా, చాతీభాగంలోనూ పొడిచాడు. బాధతో ఆమె కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న ధనలక్ష్మి ఉలిక్కిపడి లేచింది. 

ఆమెను చూసిన దేవేంద్రన్ తాను పొడిచింది ధనలక్ష్మిని కాదని తెలుసుకున్నాడు. ఆ వెంటనే ఆమెపైనా దాడిచేశాడు. ఈలోపు స్థానికులు మేల్కొనడంతో దేవేంద్రన్ పరారయ్యేందుకు ప్రయత్నించి వారికి పట్టుబడ్డాడు. అతడిని చితకబాదిన వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికే తీవ్రంగా గాయపడిన గౌసర్ మృతిచెందింది. మరోవైపు, గాయపడిన ధనలక్ష్మిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamil Nadu
Crime News
Wife
Ambur

More Telugu News