Ruturaj Gaikwad: సెంచరీ మిస్ అయితే ఏంటి? విజయం మాదే కదా!: రుతురాజ్ గైక్వాడ్

  • కుటుంబం, స్నేహితుల ముందు రాణించానన్న రుతురాజ్ 
  • ఇది తనకు పెద్ద విజయమంటూ కామెంట్ 
  • జట్టు విజయానికి పాటుపడ్డానని సంతోషం 
  • దేవాన్ కాన్వేతో భాగస్వామ్యాన్ని ఆనందించానని వ్యాఖ్య 
Ruturaj Gaikwad not fussed about getting out on 99 against Sunrisers Hyderabad Winning the game is important

సన్ రైజర్స్ తో ఆదివారం నాటి మ్యాచ్ లో సెంచరీ మిస్ కావడం పట్ల సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. 57 బంతుల్లో 99 పరుగులు చేసిన తర్వాత.. గైక్వాడ్ షాట్ ఆడబోయి వికెట్ పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు నిశ్చేష్టుడై  బ్యాట్ తో హెల్మెట్ ను కొట్టుకోవడం కనిపించింది. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత సెంచరీ మిస్ కావడం పట్ల చింతిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది. 

దీనికి గైక్వాడ్ స్పందిస్తూ.. ‘‘సొంత మైదానంలో (గైక్వాడ్ పూణె వాసి) పెద్ద స్కోరు సాధించడం నాకు ప్రత్యేకం. మరీ ముఖ్యంగా జట్టు విజయానికి కృషి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. కుటుంబం, స్నేహితుల ముందు ఆడుతున్నా నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. వారు గర్వపడేలా చేయాలనుకున్నాను. వారి ముందు రాణించడమే నాకు పెద్ద విజయం. ఇటువంటి సందర్భం కోసమే వేచి చూస్తున్నాను. అది రానే వచ్చింది. నేను నిరూపించుకున్నాను’’ అని గైక్వాడ్ చెప్పాడు.

దేవాన్ కాన్వేతో కలసి గైక్వాడ్ 182 పరుగుల భాగస్వామ్యం ఏర్పాటు చేయడం విశేషం. దేవాన్ కాన్వే సైతం 55 బంతులకు 85 పరుగులు సాధించాడు. కాన్వేకు ఐపీఎల్ లో ఇదే తొలి అర్ధ సెంచరీ. మైదానం బయట కాన్వేతో మాట్లాడడం ఆటను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడినట్టు వివరించాడు. 

‘‘దేవాన్ తో బ్యాటింగ్ చేయడాన్ని ఆనందించా. అతడికి  ఇది రెండో మ్యాచ్. ఐపీఎల్ లో అతడు తొలి అర్ధ సెంచరీ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. మేము కలసి ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోయినా మైదానం వెలుపల ఎక్కువ సమయం చర్చించుకున్నాం. దాంతో ఒకరి ఆటతీరు గురించి మరొకరు, మైదానంలో ఎలా నడుచుకోవాలి, పరిస్థితులకు ఎలా స్పందించాలన్నది అర్థం చేసుకున్నాం’’ అని గైక్వాడ్ తెలిపాడు.

More Telugu News