Ghani: భారీ జన సందోహం నడుమ వేడుకగా 'గని' ప్రీ రిలీజ్ ఈవెంట్

Varun Tej Ghani Pre Release event in Vizag
షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గని. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, నేడు వైజాగ్ లో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేశారు. హీరో వరుణ్ తేజ్, ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్, నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్దా తదితరులు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఈ సినీ ఫంక్షన్ కు విచ్చేశారు. 

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నిస్తానని, మంత్రి అవంతి వైజాగ్ పై ఉన్న ప్రేమతో సలహా ఇచ్చారని, దాన్ని పాటిస్తానని వెల్లడించారు. 

ఇక, తన కుమారుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, తాను ఏ ఫంక్షన్ లో అయినా బన్నీ గురించి రెండు ముక్కల్లో ముగించేస్తుంటానని తెలిపారు. అయితే ఈ ఫంక్షన్ లో కొంచెం మాట్లాడతానని వివరించారు. ఇవాళ తన పతాకాన్ని ఎక్కడికి ఎగరేశాడో మీ అందరికీ తెలుసని అన్నారు. 

"మా నాన్న అల్లు రామలింగయ్య పాలకొల్లు నుంచి మద్రాసు వెళ్లి నటుడయ్యారు. నేను నిర్మాతగా మారి చిత్రాలు తీస్తున్నాను. కానీ బన్నీ పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి చేర్చి క్రికెటర్లు సైతం తన మేనరిజంను ప్రదర్శించేలా చేశాడు. అల్లు వారి పతాకాన్ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లాడు. నేను ఎప్పుడూ మా కుటుంబ సభ్యులను ఇలా పొగడను. కానీ ఇవాళ తప్పకుండా అభినందించాలనిపిస్తోంది. అందుకే బన్నీకి అభినందనలు తెలుపుతున్నా" అంటూ తన ప్రసంగం ముగించారు.
Go Back to Shorts
Ghani
Varun Tej
Pre Release Event
Allu Arjun
Allu Aravind
Vizag

More Telugu News