womens world cup: భారత మహిళా జట్టుకు మరో పరాభవం.. ఇంగ్లండ్ చేతిలో చిత్తు

Inconsistent India lose to England by 4 wickets
  • 36 ఓవర్లకే ముగిసిన భారత్ బ్యాటింగ్
  • 134 పరుగులకు కట్టడి
  • 31 ఓవర్లకే ఇంగ్లండ్ సునాయాస విజయం
  • పరుగులు రాబట్టడంలో మిథాలీరాజ్ సేన విఫలం
మహిళల ప్రపంచకప్ లో భారత క్రికెట్ జట్టు రెండో ఓటమి చవిచూసింది. లీగ్ దశలో మిథాలీ రాజ్ సేన బుధవారం ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. నిలకడలేని ఆటతీరుతో భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్ జట్టు భారత్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ లో ఇంగ్లండ్ కు ఇదే తొలి విజయం. మూడు వరుస ఓటముల తర్వాత భారత జట్టును మట్టి కరిపించింది. 

ఇంగ్లండ్ బౌలర్లు రాణించడం భారత జట్టు ఓటమిని డిసైడ్ చేసింది. కేవలం 134 పరుగులకే (36.2 ఓవర్లు) భారత జట్టును ఆల్ అవుట్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. బే ఓవల్ మైదానంలో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ చెలరేగిపోయింది. నాలుగు వికెట్లతో భారత్ జట్టును కట్టడి చేసేసింది. ఆమెకు అన్య ష్రబ్ సోల్, కేట్ క్రాస్ సహకారం అందించడంతో తక్కువ స్కోరుకే భారత్ ను నిలువరించారు. స్మ‌ృతి మందన 35, రిచా ఘోష్ 33 మాత్రమే చెప్పుకోతగ్గ పరుగులు సాధించారు.

తర్వాత 135 పరుగుల లక్ష్యంతో ఛేదన మొదలు పెట్టిన ఇంగ్లండ్ జట్టు కేవలం 31.2 ఓవర్లలోనే, ఆరు వికెట్లు నష్టపోయి ఆటను ఫినిష్ చేసింది. హెథర్ నైట్ 53, నట్ సివర్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. భారత్ పై విజయంతో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పుంజుకుంది. భారత జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 8 పాయింట్లు, దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
womens world cup
India
defeat
England

More Telugu News