Congress: ‘ఘర్ కా కాంగ్రెస్’ వద్దన్న కపిల్ సిబల్ పై.. కాంగ్రెస్ పెద్దల ఘాటు వ్యాఖ్యలు

Congress Veterans Slam Sibal For His Remarks On Sonia
  • సోనియాను దిగిపొమ్మనడానికి ఆయనెవరన్న అధీర్ రంజన్ చౌదరి
  • ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారన్న మాణిక్కం ఠాగూర్
  • బీజేపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ కే ఉందని అశోక్ గెహ్లాట్ కామెంట్
  • సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పవన్ ఖేరా సవాల్
‘ఘర్ కా కాంగ్రెస్’ కాకుండా ‘సబ్ కా కాంగ్రెస్’గా పార్టీని బలపరచాలంటే కాంగ్రెస్ నుంచి గాంధీ (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ)లు ఇక తప్పుకోవాలన్న ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడ్డారు. సోనియా గాంధీని దిగిపొమ్మనడానికి ఆయనెవరూ? అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లోక్ సభా పక్షనేత అయిన అధీర్ రంజన్ చౌదరి పరుష వ్యాఖ్యలు చేశారు. సోనియాను దిగిపొమ్మనడానికి ఆయనకేం అర్హతలున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉన్న ఆయన.. ఇప్పుడు కేంద్రంలో యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం లేకపోవడంతో అంతా చెడే జరుగుతోందన్న భావనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 

ఎంపీ, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్.. సిబల్ పై విమర్శలు కురిపించారు. ‘‘నాయకత్వ బాధ్యతల నుంచి నెహ్రూ, గాంధీలను ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు తప్పించాలనుకుంటున్నాయో తెలుసా? వాళ్లు లేకుండా కాంగ్రెస్ కూడా మరో జనతా పార్టీలా తయారవుతుంది కాబట్టి. అప్పుడు కాంగ్రెస్ ను చంపడం చాలా తేలికవుతుంది. భారత్ అనే సిద్ధాంతాన్ని చంపడం సులువవుతుంది. సిబల్ కు ఈ విషయం బాగా తెలుసు. అయినా, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల భాషనే సిబల్ కూడా వాడుతున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

పార్టీ అధినాయకత్వంపై అవాకులు–చవాకులు పేలే బదులు త్వరలో జరగబోయే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సిబల్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయింది సిబల్ వల్ల కాదా? అని ప్రశ్నించారు. సిబల్ వ్యాఖ్యలు దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. 

ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్న ఇలాంటి తరుణంలో పార్టీ నేతలంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీని ఢీకొట్టగలిగే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురెళ్లే వ్యక్తి కేవలం రాహుల్ గాంధీనేనని ఆయన అన్నారు.
Congress
Rahul Gandhi
Sonia Gandhi
Kapil Sibal

More Telugu News