రేపే సీఎంను కలుస్తా: జగ్గారెడ్డి
- అసెంబ్లీలో ఉద్యోగాలపై కేసీఆర్ ప్రకటన
- సీఎం ప్రకటనను స్వాగతించిన జగ్గారెడ్డి
- కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతానని ప్రకటన
బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ బయటకు వచ్చిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తమ పార్టీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేశామని ఆయన చెప్పారు.
ఆ డిమాండ్ మేరకు ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్నందున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయన అపాయింట్‌మెంట్ కోరనున్నట్లుగా జగ్గారెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని కూడా జగ్గారెడ్డి కీర్తించారు.