శ్రీలంకతో మొదటి టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట... తలో చేయి వేసిన టీమిండియా బ్యాట్స్ మెన్
- మొహాలీలో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- ఆట చివరికి 6 వికెట్లకు 357 పరుగుల స్కోరు
- 96 పరుగులు చేసి అవుటైన పంత్
- రాణించిన విహారి, కోహ్లీ, జడేజా
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తొలి వికెట్ కు 52 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన తెలుగుతేజం హనుమ విహారి ఎంతో ఓపికగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. లంక బౌలర్లు ఊపుమీదున్న దశలో బరిలో దిగిన విహారి 128 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు.
ఇక, 100వ టెస్టు ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 పరుగులకు అవుటయ్యాడు. కోహ్లీని లంక స్పిన్నర్ ఎంబుల్దెనియా బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేసి ధనంజయ డిసిల్వా బౌలింగ్ లో వెనుదిరగ్గా, క్రీజులో రవీంద్ర జడేజా 45 పరుగులతోనూ, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులతోనూ ఆడుతున్నారు.
శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దెనియా 2 వికెట్లు తీయగా, లక్మల్, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ధనంజయ డిసిల్వ తలో వికెట్ తీశారు.