Kerala: మళ్లీ వూహాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారత తొలి కరోనా రోగి!

First Indian who tested Covid positive wants to return to wuhan
  • చైనాలో మెడిసిన్ చదువుతున్న త్రిసూర్‌కు చెందిన యువతి 
  • సెలవులలో 2020 జనవరిలో ఇండియాకు రాక
  • 2020 జనవరి 30న కరోనా సోకినట్టు నిర్ధారణ
  • ఇంటర్న్ షిప్ కోసం వూహాన్ వెళ్లడం తప్పనిసరి   
  • భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్న యువతి తండ్రి 
భారత్‌లో తొలి కరోనా రోగిగా గుర్తింపు పొందిన కేరళలోని త్రిసూర్‌కు చెందిన యువతి.. మహమ్మారి వెలుగుచూసిన చైనాలోని వూహాన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసి వైద్యురాలై తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది. సెమిస్టర్ సెలవుల నేపథ్యంలో 2020 జనవరి చివరి వారంలో భారత్ చేరుకున్న యువతికి అదే నెల 30న నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ తర్వాతి రోజు ఆసుపత్రిలో చేరింది. అంటే భారత్‌లో కరోనా అడుగుపెట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు.

ఈ ఘటన తర్వాత అటు వూహాన్‌తోపాటు ప్రపంచమంతా వైరస్ పాకిపోయింది. దీంతో చైనా కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేసింది. ఫలితంగా కేరళ యువతి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. ఆన్‌లైన్ ద్వారా ఎంబీబీఎస్ పూర్తిచేసింది. అయితే, ఎంబీబీఎస్ పట్టా అందుకోవాలంటే భారత్‌లో హౌస్ సర్జన్‌కు సమానమైన 52 వారాల ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆమె చైనా వెళ్లడం తప్పనిసరి.

ఈ నేపథ్యంలో తిరిగి వూహాన్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. కొవిడ్ ప్రస్తుతం నియంత్రించగలిగే స్థాయిలోనే ఉందని, కాబట్టి వూహాన్‌లో చదువుకుంటున్న వందలాదిమంది విద్యార్థులు చైనా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, చైనా అధికారులతో మాట్లాడాలని ఆమె తండ్రి కోరుతున్నారు.
Kerala
China
Wuhan
MBBS
Young Girl

More Telugu News