Pawan Kalyan: కరోనా తీవ్రతరమవుతోంది... అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించండి: పవన్ కల్యాణ్

Pawan Kalyan suggests wear double mask to prevent corona
  • దేశంలో భారీ ఎత్తున కరోనా కేసులు
  • నిన్న ఒక్కరోజే 1.80 లక్షల కేసులు వచ్చాయన్న పవన్
  • చూస్తుండగానే కరోనా బారినపడుతున్నారని ఆందోళన
  • ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని సూచన 
  • ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని హితవు
భారత్ లో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుండడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోందని, యావత్ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో నిన్న ఒక్కరోజే 1.80 లక్షల కరోనా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయని, అంతకుముందు రోజు ఆ సంఖ్య 1.59 లక్షలుగా ఉందని, దీన్నిబట్టే మహమ్మారి ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమవుతోందని తెలిపారు.

ఏపీ, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, చూస్తుండగానే మన చుట్టూ కరోనా సోకినవారు పెరుగుతున్నారని వివరించారు. దేశంలో ప్రస్తుతం 7.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, నిపుణుల సూచనలు తప్పకుండా పాటించాలని, మాస్కుల వాడకం, భౌతికదూరం పాటించడం వంటి మార్గదర్శకాలు అనుసరించాలని పవన్ సూచించారు. అందబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని సలహా ఇచ్చారు.

విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేద్దామని, రాబోయే సంక్రాంతిని కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవడానికి ప్రయత్నిద్దామని తెలిపారు. ఎవరైనా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోకపోతే, వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేశారు. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా ఉద్ధృతిని కొంతవరకు తగ్గించుకోగలం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా జనసైనికులు, వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, కరోనా నేపథ్యంలో ఆపదలో ఉన్నవారిని ఎప్పటిలాగే ఆదుకోండి అని పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడిపోయారని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం కావాలంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Corona Virus
Double Mask
Andhra Pradesh
Telangana
India
Janasena
COVID19

More Telugu News