అలాంటప్పుడు కిరాణే షాపులే పెట్టుకోండి: హీరో నానికి మంత్రి కొడాలి నాని కౌంటర్
- థియేటర్ల కంటే కిరాణా షాపులకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయన్న హీరో నాని
- కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పుడు అవే పెట్టుకోవచ్చుకదా అన్న కొడాలి నాని
- ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శ
తాజాగా మంత్రి కొడాలి నాని కూడా తనదైన శైలిలో హీరో నాని వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పుడు సినిమావాళ్లు తమ పెట్టుబడులతో కిరాణా కొట్లే పెట్టుకోవచ్చు కదా? అని కొడాలి నాని సెటైర్ వేశారు. సినిమా టికెట్ ధరలను తమ ప్రభుత్వం తగ్గించలేదని ఆయన అన్నారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని గతంలో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారని... అలాంటి పరిస్థితి ఉండకూడదనే తమ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు. తాము టికెట్ ధరలను తగ్గించలేదని అన్నారు.
కోర్టుల అనుమతితో ప్రేక్షకులను సినీ పరిశ్రమలోని కొందరు అడ్డంగా దోచుకునేందుకు అవకాశం లేకుండా తాము చేశామని కొడాలి నాని చెప్పారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని... ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. మరోవైపు ఈరోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు.