Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ మృతిపై దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి, మహేశ్ బాబు

Chiranjeevi and Mahesh Babu shocked to the sudden demise of Puneeth Raj Kumar
  • గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణం
  • టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు
  • సంతాపం తెలియజేసిన అగ్రనటులు
  • నమ్మలేకపోతున్నానంటూ మంచు విష్ణు వేదన
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదానికి గురిచేసింది. టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మహేశ్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని చిరంజీవి పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర రంగానికి పునీత్ మరణం పెద్ద లోటు అని పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

మహేశ్ బాబు స్పందిస్తూ.... పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషాదవార్త చూసి షాక్ కు గురయ్యానని, తీవ్ర విచారం కలుగుతోందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని వివరించారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

అటు, టాలీవుడ్ నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని, తన సోదర సమానుడు పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న వార్తను తాను అంగీకరించనని పేర్కొన్నారు.
Puneeth Raj Kumar
Chiranjeevi
Mahesh Babu
Karnataka

More Telugu News