హైదరాబాద్లో భారీ చోరీ.. వృద్దుడి కాళ్లు, చేతులు కట్టేసి రూ. 50 లక్షల విలువైన సొత్తుతో కాపలాదారు పరారీ
- 20 రోజుల క్రితమే కాపలాదారుగా చేరిన నేపాలీ దంపతులు
- అందరూ నిద్రించిన తర్వాత ముఠా సభ్యులను పిలిచి చోరీ
- పనివారి వివరాలను ‘హ్యాక్ ఐ’లో నమోదు చేసుకోవాలంటున్న పోలీసులు
- గత మూడేళ్లలో నేపాలీలపై 38 కేసులు
యజ్ఞ అగర్వాల్ తాత ఓం ప్రకాశ్ అనారోగ్యం పాలవడంతో కాపలాదారు దీపేశ్ ఆయనకు సాయంగా ఉంటున్నాడు. శుక్రవారం యజ్ఞ భార్యాపిల్లలతో కలిసి ఐదో అంతస్తులో నిద్రించగా, ఓంప్రకాశ్ అగర్వాల్, దీపేష్ నాలుగో అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దీపేష్.. భార్య నిఖితతో పాటు మరో ముగ్గురిని పిలిపించాడు. అందరూ కలిసి ఓంప్రకాశ్ కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి బీరువాలోని రూ. 50 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ. 5 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు.
ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పరిస్థితులు గమనించిన పోలీసులు ఇది నేపాలీ ముఠా పనేనని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత మూడేళ్లలో నేపాలీలపై 38 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా కొత్తగా పనివాళ్లను చేర్చుకోవాలనుకుంటే ముందుగా హైదరాబాద్ పోలీసుల అధికారిక వెబ్సైట్ ‘హ్యాక్ఐ’ లో వారి వివరాలు నమోదు చేస్తే, వారి నేరచరిత్ర గురించి వివరిస్తామని పేర్కొన్నారు.