హైదరాబాదులో కుండపోత వాన... లోతట్టు ప్రాంతాలు జలమయం!
- దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం
- ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్
- ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్న జీహెచ్ఎంసీ
- సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 040-29555500
నగరంలో చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. మాదాపూర్-కూకట్ పల్లి ఫ్లైఓవర్ పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పంజాగుట్ట, సోమాజీగూడ, టోలీచౌకి-మెహదీపట్నం, కోఠి-సికింద్రాబాద్ మార్గంలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వారాంతం కావడంతో భారీగా బయటికి వచ్చిన జనాలు భారీవర్షం కారణంగా రోడ్లపైనే చిక్కుకుపోయారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని స్పష్టం చేశారు. భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాచారం, సహాయం కోసం 040-29555500 నెంబరుకు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు. అటు, విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.