ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం
- పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా
- తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సమయంలో భేటీ
ఈ సమావేశంలో ఏ విషయాలపై చర్చ జరిగిందీ మాత్రం తెలియరాలేదు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన శిక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఇతర దేశాలతోపాటు భారత్తో కూడా తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఇది వరకు తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత దోహాలోని రాయబార కార్యాలయంలో భారత రాయబారి దీపత్ మిట్టల్తో సమావేశమయ్యారు కూడా. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈ భేటీలో తాలిబన్లకు భారత్ స్పష్టంగా చెప్పింది.