Hrithik Roshan: హృతిక్, కత్రినా యాడ్లతో జొమాటోపై విమర్శలు.. వివరణ ఇచ్చిన కంపెనీ!
- సెలెబ్రిటీ యాడ్లపై జొమాటోపై నెటిజన్ల ఫైర్
- యాడ్‌పై వివరణ ఇచ్చిన ఫుడ్ డెలివరీ కంపెనీ
- ఆరు నెలల క్రితం చేశామని ప్రకటన
- డెలివరీ ఏజెంట్ల జీతాలపై త్వరలోనే వివరణ
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోపై తాజాగా నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్‌తో చేసిన రెండు యాడ్స్ ను తాజాగా ఈ కంపెనీ విడుదల చేసింది. వీటిలో ఒక దానిలో డెలివరీ ఏజెంట్.. హృతిక్ రోషన్‌కు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు.
అక్కడ సినీ హీరోను చూసి ఆశ్చర్యపోయిన డెలివరీ ఏజెంట్‌ను హృతిక్ సెల్ఫీ అడుగుతాడు. అతను ఆనందంగా ఒప్పుకుంటాడు. అయితే అదే సమయంలో డెలివరీ ఏజెంట్ ఫోన్ మోగుతుంది. దీంతో హృతిక్‌కు సారీ చెప్పిన డెలివరీ ఏజెంట్.. సెల్ఫీ ఛాన్స్ వదిలేసుకొని డెలివరీ ఇవ్వడానికి వెళ్లిపోతాడు. ‘‘హృతిక్ అయినా.. మీరైనా.. మాకు అందరూ స్టార్లే’’ అనే క్యాప్షన్‌తో ఈ యాడ్ విడుదలైంది.
కత్రినా యాడ్ కూడా ఇదే పద్ధతిలో సాగుతుంది. ఇక్కడ కత్రినా తన బర్త్‌డే కేక్ ఇస్తాను వెయిట్ చేయాలని డెలివరీ ఏజెంట్‌ను అడుగుతుంది. ఈ యాడ్స్ విడుదలైన తర్వాత జొమాటోపై నెటిజన్లు మండిపడ్డారు. సెలెబ్రిటీలకు కోట్లకు కోట్లు డబ్బులిచ్చి యాడ్లు చేసే ఈ కంపెనీ దగ్గర.. డెలివరీ ఏజెంట్లకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా? అంటూ మండిపడుతున్నారు.
కొన్నిరోజుల క్రితం కొంతమంది జొమాటో డెలివరీ పార్టనర్లు తాము గంటలకొద్దీ పని చేస్తున్నామని, కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త యాడ్లపై వచ్చిన వేడిని చల్లార్చేందుకు జొమాటో వివరణ ఇచ్చింది.
ఇలాంటి గొడవలు జరగడానికి చాలారోజుల ముందుగానే ఈ యాడ్లను సుమారు ఆరు నెలల క్రితం షూట్ చేసినట్లు వివరించింది. అలాగే డెలివరీ ఏజెంట్ల సమస్యలపై త్వరలోనే వివరణ ఇస్తామని ప్రకటించింది. ప్రతి కస్టమరూ తమ దృష్టిలో స్టార్ అనే ఉద్దేశ్యంతో తాము ఈ యాడ్స్ తీశామని, కానీ కొందరు వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది.