తెలంగాణలో కుంభవృష్టి.. రెండు రోజుల్లో ఆరుగురి మృత్యువాత

Heavy rains lashed out in telangana
  • తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వానలు
  • పొలాలు, జనావాసాల మునక
  • మొన్న గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యం
  • నేడు కూడా భారీ వర్షాలకు అవకాశం
  • అప్రమత్తంగా ఉండాలంటూ సీఎస్ ఆదేశాలు
కుంభవృష్టితో తెలంగాణ అతలాకుతలమైంది. పలు జిల్లాల్లో కురిసిన అతి భారీ వానలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వాన కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. లో లెవల్ కాజ్‌వేలు ప్రమాదకరంగా మారాయి. ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద లోలెవల్ వంతెనపై ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికుల కేకలతో  అప్రమత్తమైన స్థానిక రైతులు వారిని రక్షించారు. వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వద్ద వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వరంగల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు మురుగుకాల్వలో పడి చనిపోయాడు. కుమురం భీం జిల్లాలో టేకం డోభి (28) అనే యువకుడు బుగ్గగూడ వాగులో గల్లంతయ్యాడు. ఆదివారం గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు నిన్న లభ్యమయ్యాయి.

వరంగల్, వికారాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. పొలాలు, జనావాసాలు నీటమునిగాయి. నిన్న అత్యధికంగా కుమురం భీం జిల్లా దహేగాంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నేడు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
Go Back to Shorts
Heavy Rains
Telangana
Warangal
Peddapalli District

More Telugu News