తమిళనాడులో ఎస్సై ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్!
- లింగ మార్పిడి చేయించుకున్న శివన్య
- పోలీస్ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తు
- ఈవెంట్లు, పరీక్షల్లో సత్తా చాటిన వైనం
- ఇటీవల నియామక పత్రం అందించిన సీఎం స్టాలిన్
తిరువణ్ణామలైకి చెందిన శివన్య కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. కొన్నాళ్ల కిందట లింగ మార్పిడి చేయించుకున్న శివన్యకు పోలీసు ఉన్నతాధికారి అవ్వాలనేది ఓ కల. అందుకే తమిళనాడు ప్రభుత్వ పోలీసు నియామక పరీక్షలకు హాజరైంది. ఫిజికల్ ఈవెంట్లలోనూ సత్తా చాటింది. ఆపై రాత పరీక్షలు, ఇంటర్వ్యూలోనూ శివన్య ప్రతిభ చాటింది.
ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. నీకు పోలీస్ ఉద్యోగం కావాలా? అంటూ వెక్కిరింపులు ఎదురయ్యాయి. అవేవీ శివన్య స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అన్నింటా సత్తా నిరూపించుకున్న ఈ ట్రాన్స్ జెండర్ ఎస్ఐగా ఎంపికై, ఇటీవలే సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది.
కాగా, తన లక్ష్యం డీఎస్పీ అని, ఎప్పటికైనా ఆ ఉద్యోగాన్ని సాధిస్తానని శివన్య ధీమాగా చెబుతోంది. తన ప్రస్థానంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని వివరించింది. కాగా, శివన్య సోదరుడు తమిళనిధి పోలీసు డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నాడు. ఏదేమైనా శారీరక అవరోధాలను అధిగమించి ఓ ట్రాన్స్ జెండర్ పోలీసు అధికారిణిగా ఎంపిక కావడం స్ఫూర్తిదాయకం.