అగ్రవర్ణ పేదలకు 'ఈడబ్ల్యూఎస్' రిజర్వేషన్ కోటా అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా
- రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు అర్హత
- 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను సవరించిన కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే అగ్రవర్ణ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తిస్తారు. ఈ కోటా కింద లబ్ధి పొందాలనుకునేవారు తహసీల్దార్ నుంచి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందని ఇతర వర్గాల వారు ఈ కోటా కిందకు వస్తారు.
అగ్రవర్ణ పేదలకు కోటాను ప్రవేశ పెడుతూ 2019లో రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ కోటా కోసం పలు నిబంధనలను కూడా విధించింది. లబ్ధిదారులకు ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు. నగరాల్లో అయితే వెయ్యి చదరపు అడుగులకు మించి ఫ్లాట్ ఉండరాదు. నగరాల్లో వంద గజాలు, గ్రామాల్లో రెండొందల గజాలకు మించి ఇంటి స్థలం ఉన్నవారు ఈ కోటా కిందకు రారని కేంద్రం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనలను తీసేసి... వార్షికాదాయం రూ. 8 లక్షలకు మించరాదనే ప్రాతపదికను మాత్రమే తీసుకుంది.