అర్జెంటీనా టీమ్ సంబరాలు చేసుకుంటుంటే నేమార్ ను ఓదార్చిన మెస్సీ... స్నేహానికి నిదర్శనం ఈ వీడియో!
- కోపా అమెరికా టోర్నీ విజేత అర్జెంటీనా
- ఫైనల్లో బ్రెజిల్ పై విజయం
- హతాశుడైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్
- నేమార్ ను హత్తుకుని ఊరడించిన మెస్సీ
కోపా అమెరికా ఫైనల్లో ఓటమి పట్ల తీవ్ర వేదనకు లోనైన తన మిత్రుడు నేమార్ ను అర్జెంటీనా స్టార్ మెస్సీ హత్తుకుని ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్న పిల్లవాడిలా బాధపడుతున్న నేమార్ ను హృదయానికి హత్తుకుని అతని వేదనను తగ్గించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నేమార్, మెస్సీ... ఫుట్ బాల్ ప్రపంచంలో రారాజులు. ఒకరేమో బ్రెజిలియన్, మరొకరేమో అర్జెంటీనా జాతీయుడు. కానీ వీరిద్దరినీ కలిపింది బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్. గతంలో వీరిద్దరూ యూరప్ లీగ్ పోటీల్లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించారు. తమ సాకర్ నైపుణ్యంతో బార్సిలోనా జట్టుకు అనేక విజయాలు అందించారు. ఆ సందర్భంగా ఏర్పడిన చెలిమి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా కోపా అమెరికా టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత తమ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.