Corona Virus: భారత్ లో కరోనా లాంబ్డా వేరియంట్?... కేంద్రం వివరణ

Centre clarifies on Corona Lambda variant
  • కరోనా శ్రేణిలో కొత్త వేరియంట్
  • లాంబ్డా వేరియంట్ గా పిలుస్తున్న పరిశోధకులు
  • 25 దేశాల్లో వ్యాప్తి
  • పెరూ దేశంలో 80 శాతం కేసులు దీనివల్లే!
  • మన దేశంలో ఒక్క కేసూ లేదన్న కేంద్రం
చైనాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి వేగంగా ఉత్పరివర్తనాలకు లోనవుతూ, కొత్త వేరియంట్ల రూపంలో ఉనికిని చాటుకుంటోంది. ఇప్పటికే భారత్ లో కరోనా డెల్టా, డెల్టా ప్లస్ తో పాటు తాజాగా కప్పా వేరియంట్ కూడా వ్యాపిస్తున్నట్టు నిర్ధారణ అయింది. వీటికి తోడు కొత్తగా కరోనా లాంబ్డా వేరియంట్ భారత్ లో ప్రవేశించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.

ఇప్పటివరకు భారత్ లో ఒక్క లాంబ్డా వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలోని సార్స్ కోవ్-2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (ఇన్సాకోగ్) కొత్త వేరియంట్ల ఉనికిపై డేగ కన్నుతో పరిశీలిస్తోందని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 14న చేసిన ప్రకటన ప్రకారం... ఇప్పటివరకు గుర్తించిన అత్యంత ప్రభావశీలత కలిగిన కరోనా వేరియంట్లలో లాంబ్డా 7వ వేరియంట్ అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. మన దేశంలో దీని ఉనికి ఇప్పటివరకు వెల్లడి కాలేదని ఇన్సాకోగ్ నివేదికలు చెబుతున్నాయని వివరించారు. ఇది 25 దేశాల్లో వ్యాప్తిలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని, ఒక్క పెరూ దేశంలోనే 80 శాతం కేసులు ఈ లాంబ్డా వేరియంట్ వల్లే వచ్చాయని వివరించారు.

నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ దీనిపై మాట్లాడుతూ, లాంబ్డా వేరియంట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇంకా స్పష్టం కాలేదని తెలిపారు.
Corona Virus
Lambda Variant
Centre
INSACOG
WHO
India

More Telugu News