AIMIM: యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ: అసదుద్దీన్‌

AIMIM Will contest in 100 seats in UP
షార్ట్స్‌లో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

యూపీలో ఓ.పి.రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్పీ పార్టీతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’లో భాగంగా ఉన్నామన్నారు. ఇక ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు విషయంపై చర్చించలేదన్నారు. ఈ కూటమిలో మరో ఎనిమిది చిన్న పార్టీలు కూడా ఉండడం గమనార్హం. అయితే, ఈ కూటమిలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కూడా భాగం కానుందని నిన్నటి వరకు ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు ఓవైసీ, మాయావతి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. కానీ, నేడు ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆమె.. యూపీ, ఉత్తరాఖండ్‌లో  బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

గత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీకి దిగిన ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందింది. కానీ, ఇటీవల బెంగాల్‌ సహా తమిళనాడులో ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
AIMIM
Asaduddin Owaisi
UP
BSP

More Telugu News