అరేబియా సముద్రంలో 'తౌతే '... రుతుపవనాల రాకకు శుభసంకేతం!
- వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
- ఈ నెల 16న గుజరాత్ వద్ద తీరాన్ని తాకే అవకాశం
- పలు రాష్ట్రాలు, లక్షద్వీప్ కు వర్షసూచన
- గుజరాత్ కు కుంభవృష్టి, పెనుగాలుల హెచ్చరిక
- ఏపీపై 'తౌతే' ప్రభావం పాక్షికం
దీని ప్రభావంతో లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌతే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్ అంచనాలకు తగ్గట్టుగానే వర్షపాతాన్ని ఇస్తుందని పలు వాతావరణ సంస్థలు ముందస్తు నివేదికల్లో వెల్లడించాయి.