USA: ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. సగం తెగినా ల్యాండ్​ అయిన విమానం!

Two planes collided mid air in US Landed safely
  • పారాచూట్ తో సురక్షితంగా దిగిన ఇంకో ఫ్లైట్
  • రెండు చిన్న విమానాల్లోని ముగ్గురు క్షేమం
  • అమెరికాలోని డెన్వర్ లో ఘటన
  • ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్న అధికారులు
ఆకాశంలో రెండు విమానాలు ఢీ కొట్టుకుని.. ఓ విమానం దాదాపు సగం తెగితే వాటి పరిస్థితేంటి? ఏముంటుంది.. కుప్పకూలి పేలిపోవాలి కదా! కానీ, అమెరికాలోని డెన్వర్ లో మాత్రం రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం బుధవారం జరిగింది. ప్రమాదం వివరాలను అరాపాహో కౌంటీ పోలీసు అధికారులు వెల్లడించారు.

చెర్రీ క్రీక్ స్టేట్ పార్క్ వద్ద బుధవారం ఉదయం 10.25 గంటలకు రెండు చిన్న విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి. అందులో కీ లైమ్ ఎయిర్ మెట్రోలైనర్ కు చెందిన విమానం దాదాపు సగానికి తెగింది. అయితే అదృష్టవశాత్తూ ఆ విమానం కూలిపోలేదు. సమీపంలోని సెంటెనియల్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులోని ఒక ప్రయాణికుడూ సురక్షితంగా ఉన్నాడు.


సిర్రస్ ఎస్ఆర్ 22 అనే మరో విమానం పారాచూట్ సాయంతో పక్కన పొలాల్లో దిగింది. అందులోని ఇద్దరు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి ఏ విమానం కారణమైందన్నది మాత్రం తెలియలేదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రకటించింది. విమాన శకలాలు చాలా దూరం వరకూ పడ్డాయని, వాటిని ఎవరూ తాకొద్దని, వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని సూచించింది.
USA
Flight
Safe Landed
Flight Accident

More Telugu News