Tollywood: దర్శకుడు తేజ ఆ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారట!

Director Teja Postpones chitram sequel project
  • యువ హీరోలను పరిచయం చేసిన దర్శకుడు తేజ
  • రాణా సోదరుడు అభిరామ్‌ను పరిచయం చేసేందుకు సిద్ధం
  • 50 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్‌ తీయాలని కోరిక
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఐడియాను విరమించుకున్న తేజ
  • ఫోకస్‌ మొత్తం అభిరామ్‌ తొలి సినిమాపైనే
ఉదయ్‌ కిరణ్‌, నితిన్‌ సహా పలువురు యువ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. చిత్రం, జయం, నిజం వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేశారు. ఆయన తీసిన ‘చిత్రం’ సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనమనే చెప్పాలి.

ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దివంగత ఉదయ్‌ కిరణ్‌ ఆ తర్వాత అనేక మంచి అవకాశాలను చేజిక్కించుకున్నాడు. అయితే ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్‌ తీయాలని దర్శకుడు తేజ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. 50 మంది కొత్త ఆర్టిస్టులతో ‘చిత్రం 2’ తెరకెక్కించాలని అనుకున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే దాన్ని సెట్స్ పైకి తీసుకుకెళదామనుకున్నారని సమాచారం.

కానీ, కరోనా మహమ్మారి మూలంగా ప్రస్తుతానికి తేజ ఆ ఆలోచనను విరమించుకున్నారట. ప్రముఖ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్‌ను పరిచయం చేసే సినిమా పైనే ఫోకస్‌ పెట్టారట. ఈ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను పూర్తి చేయడం ఓ పెద్ద సవాలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దృష్టి మొత్తం ఈ సినిమాపైనే పెట్టాలన్న ఉద్దేశంతోనే చిత్రం 2ను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Tollywood
Director Teja
Rana Daggubati

More Telugu News