కరోనా మహమ్మారికి బలైన నటి మాలాశ్రీ భర్త!

  • వారం రోజుల క్రితం సోకిన కరోనా
  • బెంగళూరులో చికిత్స పొందుతూ కొణిగల్ రాము మృతి
  • సంతాపం వెలిబుచ్చిన శాండల్ వుడ్
దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా రాణించి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మాలాశ్రీభర్త, నిర్మాత కొణిగల్ రాము కరోనా మహమ్మారికి బలయ్యాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు. గత వారంలో ఆయనకు కరోనా నిర్దారణ కాగా, అప్పటి నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి, నిన్న సాయంత్రం ఆయన మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా, తుముకూరు ప్రాంతానికి చెందిన రాము, శాండల్ వుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఓ వెలుగు వెలిగారు. దాదాపు 39 చిత్రాలను నిర్మించిన ఆయనకు 'కోటి రాము' అన్న పేరుంది. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసినందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ఆయన, మాలాశ్రీ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే వివాహమాడారు. ఆయనకు ఓ కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తను గురించి తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు వ్యాఖ్యానించారు.



More Telugu News

Mala Sri Konigal Ramu Corona Virus Died