Mumbai: ముంబైలోని కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

Two Killed After Fire Breaks Out At Mumbai Hospital
  • షాపింగ్ మాల్‌లో ఆసుపత్రి
  • అర్ధరాత్రి దాటాక చెలరేగిన మంటలు
  • ప్రమాద సమయంలో 76 మంది కరోనా రోగులు
  • అసలు మాల్‌లో ఆసుపత్రి ఏమిటన్న మేయర్
ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 76 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దాదాపు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.

మాల్‌లోని మొదటి అంతస్తులో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించిందని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ మాట్లాడుతూ.. అసలు ఓ మాల్‌లో ఆసుపత్రి ఉండడాన్ని తాను తొలిసారి చూస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. ఏడుగురు రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, 70 మందిని మరో ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు.
Mumbai
Hospital
Fire Accident

More Telugu News